మాస్ కోస‌మే.. బాల‌య్య తొడ మ‌ళ్లీ కొట్టించా : క్రిష్‌

krish comments on balayya about satakarni

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క‌రిది ఒక్కొక్క స్ట‌యిల్ ఉంటుంది. ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. టాలీవుడ్‌లో తొడ కొట్టడం అంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా.. ఎందుకంటే సమరసింహారెడ్డి సినిమాలో బాలయ్య తొడకొట్టే సీన్‌ అత్యంత పాపుల‌ర్ అయింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ స్టోరీకి తొడకొట్టడం మంచిగా సెట్ అవుతుంది. అది స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలో స‌క్సెస్ అయింది. కానీ .. చారిత్ర‌క క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలో తొడకొట్టడమంటే.. ఏదో చిన్న అనుమానం ఉంటుంది. అయితే బాలయ్య ఈ విష‌యంలో సందేహించినా ద‌ర్శ‌కుడు క్రిష్ మాత్రం చాలా చక్కగా సందర్భానికి తగినట్టుగా మ‌ళ్లీ నందమూరి నటసింహంతో తొడ కొట్టించేసిన విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు క్రిష్ చెప్పాడు. ఈ విశేషాల‌పై క్రిష్ మాట్లాడుతూ ‘‘జనమంతా నేను ఓ క్లాస్ డైరెక్టర్ అనే అనుకుంటున్నారు.

కాని దానిని నేను ఒప్పుకోలేను. ఇంత‌కు ముందు నేను తీసిన సినిమాలు క్లాస్ ప్రేక్ష‌కుల‌కు అల‌రించినందు వ‌ల్ల అలా అనుకుంటున్నారు. నేను మాస్ సబ్జెక్టులను తీయలేనని కాదు. నేను ఎంచుకున్న సబ్జెక్టుల వల్ల అలా అనిపించి ఉంటుంది. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా శాతకర్ణిలో కొన్ని మాస్ ఎలిమెంట్లను కూడా జోడించాను. అదే బాలకృష్ణతో తొడ కొట్టించడం. తొలుత బాలయ్య ఆ స‌న్నివేశాల‌ను చేయడానికి ఆలోచించారు. చారిత్రక సినిమాలో తొడకొట్టడమేంటి అని అన్నారు.. కానీ, ఆయన్ను ఒప్పించాను. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే… ఇంకో సన్నివేశంలో ఒకేసారి రెండు తొడలను కొట్టాలి. ఆ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది. కానీ, నాకు ఎందుకో నచ్చక ఎడిటింగ్ స‌మ‌యంలో ఆ స‌న్నివేశాన్ని తీసేయించాను. సినిమా విడుదలైన త‌రువాత మంచి స్పందన వచ్చాక.. ఆ సీన్‌ను కూడా బాలయ్య పెట్టించారు .. నేను కొద్దిగా ఆలోచ‌నలో ప‌డ్డ‌ప్ప‌టికీ .. తన మీద నమ్మకం ఉంచి స‌న్నివేశాల‌ను చేర్చాలని బాలయ్య చెప్పడంతో ఆ సీన్‌ను కూడా చేర్చాం. ఆ సీన్‌ను చూసిన అభిమానుల నుంచి అమోఘమైన స్పందన రావ‌డంతో థియేటర్లో ఆ సీన్ చూసేటప్పుడు నేనే ఈలలు వేసేంత గొప్పగా వచ్చింద‌న్నారు. బాలయ్య జడ్జిమెంట్ ఎప్పుడూ స‌క్సెస్‌గానే ఉంటుందని అభిమానుల స్పందనే నిరూపించింది’’ అంటూ తొడకొట్టే సన్నివేశం గురించి క్రిష్ వివరించాడు.

Leave a Reply

*