ఫ్లాష్ : ఎస్పీలో మరో ట్విస్ట్…అధ్యక్షుడిగా అఖిలేష్

MP Akhilesh turned as minister, MP Akhilesh, Akhilesh

ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలోని పరిణామాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు న‌డుస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి పోయిన ట్విస్ట్ లు వేగం పుంజుకున్నాయి. ఏరోజున ఎటువంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక తాజాగా తండ్రికొడుకుల డ్రామా మరో మలుపు తిరిగి ఓ ద‌శ‌కు తెర‌తీసింది. రెండు రోజుల కింద‌ట యూపీ సీఎం అఖిలేష్ ను పార్టీ నుంచి త‌న కుమారుడు అయిన‌ప్ప‌టికీ ములాయం బహిష్కరించడం.. శ‌నివారం కాస్త మెత్తబడి మళ్లీ దానిని ఎత్తివేయడంతో ముసలం సమసిపోయిందని అంద‌రూ అనుకున్నారు. మ‌ళ్లీ ఆదివారం ఈ డ్రామాకు మ‌రో కొత్త ట్విస్ట్ వచ్చింది. అధ్యక్ష పీఠంపై అఖిలేష్ పాగా వేశారు.

అంతేకాదు పార్టీ సీనియర్ నేత, తన తండ్రికి ఆప్తుడు అయిన అమర్ సింగ్ పై వేటు వేసేలా వ్యూహం తిప్పారు. సీఎం అఖిలేష్ త‌న ఎమ్మెల్యేలు – మద్దతుదారులతో లక్నోలో అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య‌ బలప్రదర్శనకు దిగారు. తండ్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంగా ములాయం స్థానంలో అఖిలేష్ యాదవ్‌ని సమాజ్ వాదీ ఛీప్‌గా ప్రకటించారు ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్. ఈ సమావేశం అక్రమమైన‌ద‌ని, దీనికి హాజరైన వారందరిపై చర్యలు ఉంటాయని ములాయం హెచ్చరించిన కొన్ని నిమిషాల్లోనే అఖిలేష్ ను పార్టీ రథసారథిగా ప్రకటించారు. దీంతోపాటు అఖిలేష్ ను ఇరుకున పెడుతున్న ప్రత్యర్థి వర్గంలోని శివపాల్ యాదవ్, అమర్ సింగ్ లను పార్టీ నుంచి సస్పెన్ష‌న్ వేటు వేశారు. జాతీయ సదస్సులో అఖిలేష్ ను పార్టీ చీఫ్‌ గా ప్రకటించిన రాంగోపాల్, పార్టీ మూలవిరాఠ్ అయిన ములాయంను మార్గదర్శకం వ్యవహరించాలని కోర‌డం విశేషంగా మారింది.

జై అఖిలేష్ నినాదాల మధ్య రాంగోపాల్ ఈ ప్రకటన చేశారు. పార్లమెంటరీ బోర్డును కొత్తగా నియమిస్తామని ఈ విషయం ఎన్నికల సంఘానికి తెలియ‌జేస్తామ‌ని రాంగోపాల్ తెలిపారు. అనేక ర‌స‌వ‌త్త‌ర ప‌రిణామాల మ‌ధ్య పార్టీ రథసారథిగా ఎన్నికైన తర్వాత అఖిలేష్ మాట్లాడుతూ.. తమకు నేతాజీ (ములాయం) స్థానం అత్యుత్తమమైనదన్నారు. యూపీలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తే ములాయం కంటే ఎక్కువ సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరన్నారు. తన తండ్రి పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుంటే దానిని అడ్డుకోవాల్సిన, కాపాడాల్సిన బాధ్యత కుమారుడిగా త‌నపై ఉంద‌న్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను తప్పుకోవాలని ములాయం అడిగి ఉంటే తాను దిగిపోయేవాడినని తెలిపారు. మా తండ్రీకొడుకుల బంధాన్ని ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. యూపీ ప్రజలకు మేలు చేసే సర్కారును మరోమారు అందిస్తామన్నారు.

Leave a Reply

*