ఎస్పీ నుంచి ఆరేళ్ల పాటు సీఎం అఖిలేష్ ఔట్

UP CM Akhilesh, CM Akhilesh, Akhilesh,

ఉత్తరప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ రాజ‌కీయాలు రోడ్డున‌ ప‌డ్డాయి. వీరి మ‌ధ్య ఉన్న అంత‌రంగ విభేధాలు ముదిరిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో పార్టీ నుంచి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను బహిష్కరిస్తున్నట్లు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్ర‌క‌టించేశారు. సీఎం అఖిలేష్ తో పాటు రాంగోపాల్ యాదవ్ ను కూడా ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనిపై ఆయ‌న స్ప‌ష్ట‌త నిస్తూ.. అఖిలేష్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమ‌ర్శించారు. పార్టీని కాపాడడం పార్టీ అధినేత‌గా తన బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు 403 స్థానాలను సీఎం అఖిలేశ్ యాదవ్ ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే ములాయం బుధవారం 325 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో ప‌రిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ప‌రిస్థితిలో ముందుగా త‌మ మద్దతుదారులతో భేటీ అయిన అఖిలేష్‌ ఆ తర్వాత ములాయం నిర్వహించిన సమావేశానికి హాజరై తన అసంతృప్తిని తెలియ‌జేశారు. ఆ తర్వాత 235 మంది అభ్యర్థులతో సొంతంగా సమాంతర జాబితా విడుదల చేశారు. దీంతో ఆగ్రహించిన ములాయం సింగ్ ఆ మరుసటి రోజునే అన‌గా శుక్ర‌వారం అఖిలేష్ పై వేటు వేశారు. అఖిలేష్‌ బుందేల్ ఖండ్ పర్యటనలో ఉండగా ఆయనకు ఏమాత్రం తెలియకుండా యూపీ పార్టీ అధ్యక్షుడైన శివ్పాల్ యాదవ్ తో కలిసి ములాయం జాబితాను ప్రకటించడంపై సీఎం మద్దతుదారులు తీవ్రంగా ప్రతిస్పందించారు. గురువారం అంతా అఖిలేశ్-ములాయం-శివ్ పాల్ నివాసాల వద్ద సందడి చోటుచేసుకుంది.

ఒకవైపు అంతర్గత సంప్రదింపులు జరుగుతుండగానే పార్టీ అధినేత ములాయం నిర్వహించిన సమావేశానికి సీఎం అఖిలేశ్ తోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివ్ పాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. వివాదాలు వీడి స‌మ‌ష్టిగా ముందుకు సాగితే ఎన్నికల సమరంలో గెలుస్తామని సీఎం అఖిలేష్ చెప్పినట్టు సమాచారం. తాను లేకుండా తానిచ్చిన అభ్యర్థులను జాబితాను పట్టించుకోకుండా 325 మంది పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంపై అఖిలేష్‌ అసంతప్తి వ్య‌క్తం చేశార‌ని తెలిసింది. అంతకుముందు ఎస్పీ ప్రధాన కార్యదర్శి ములాయంకు వరుసకు మరో సోదరుడైన రాంగోపాల్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్‌ను మళ్ళీ సీఎం చేయొద్దని పార్టీలోని చాలామంది కోరుకుంటున్నారు. కానీ ఆయననే ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు అనుకుంటున్నారన్నది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు..

Leave a Reply

*